సూర్యాపేట రైల్వే లైన్ సాధన కోసం పిలుపు

కలం, సూర్యాపేట: సూర్యాపేట (Suryapet ) జిల్లాకు రైల్వే లైన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దాలని సూర్యాపేట రైల్వే సాధన సమితి డిమాండ్ చేసింది. సూర్యాపేట రైల్వే లైన్ సాధన కోసం విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది. ఈ ఉద్యమానికి రాజకీయ రంగులు పులమకుండా పౌర సమాజం ముందుండి నాయకత్వం వహించాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి కార్యాచరణలో భాగస్వాములు కావాలని సమితి సభ్యులు కోరారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కో-కన్వీనర్ రాచురి ప్రతాప్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రంగా రెడ్డి, గౌరవ సలహాదారు లింగంపల్లి భద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రతిపాదించిన హైదరాబాద్– సూర్యాపేట– ఖమ్మం రైల్వే మార్గం, అలాగే సూర్యాపేట– కర్నూలు రైల్వే లైన్ అమలైతే సూర్యాపేట దక్షిణ తెలంగాణలో కీలక రైల్వే జంక్షన్‌గా ఎదుగుతుందని ప్రజలు ఎంతో ఆశించారని గుర్తు చేశారు. అయితే అనంతరం ఖమ్మం మార్గాన్ని మార్చి దాచేపల్లి వైపు మళ్లించడం ద్వారా సూర్యాపేట ప్రజల ఆశలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సూర్యాపేట చారిత్రక, భౌగోళిక, వాణిజ్య పరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన పట్టణమని వారు పేర్కొన్నారు. ప్రతిరోజూ దాదాపు పది మండలాల ప్రజలు, విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం సూర్యాపేటకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఎదిగిన ఈ జిల్లా కేంద్రంలో అనేక జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయడం, సూర్యాపేట ఆర్థిక సామర్థ్యానికి నిదర్శనమన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం సుమారు 55 కిలోమీటర్లు, వరంగల్ కు 125 కిలోమీటర్లు, హైదరాబాద్, విజయవాడ నగరాలు దాదాపు సమాన దూరంలో ఉన్నాయని, ఇటువంటి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతానికి రైల్వే సౌకర్యం లేకపోవడం అభివృద్ధికి తీవ్ర ఆటంకమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలకు రైల్వే అనుసంధానం ఉండగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు ఇప్పటికీ ఒక్క రైల్వే లైన్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా జిల్లాకు రైల్వే సౌకర్యం కల్పించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రైల్వే లైన్ ఏర్పడితే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రయాణికులు భారీగా లబ్ధి పొందుతారని తెలిపారు. వ్యాపారులకు సరుకుల రవాణా సులభమవుతుందని, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు తక్కువ ఖర్చుతో, వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వైద్యం, న్యాయపరమైన అవసరాలు, విద్య, ఉపాధి అవకాశాల కోసం కూడా ఈ రైల్వే మార్గం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, మొదట ప్రకటించిన హైదరాబాద్– సూర్యాపేట– ఖమ్మం రైల్వే లైన్‌ను యథాతథంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇకపై సహించబోమని స్పష్టం చేశారు.

సూర్యాపేట రైల్వే లైన్ సాధన కోసం జరిపే ఉద్యమానికి రాజకీయ రంగులు పులమకుండా పౌర సమాజం ముందుండి నాయకత్వం వహించాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి కార్యాచరణలో భాగస్వాములు కావాలని కోరారు. రాబోయే రోజుల్లో సంతకాల సేకరణ, వినతిపత్రాల సమర్పణ, ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రజాప్రతినిధుల ముట్టడులు తదితర ప్రజాస్వామ్య పోరాట కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలందరూ, వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, యువత, ఉద్యోగులు, ప్రవాసులు తమవంతు నైతిక, ఆర్థిక, కార్యాచరణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>