కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇందుకోసం వారం రోజులపాటు పక్కా ప్రణాళికను రూపొందించింది. మహిళా వారోత్సవాల నిర్వహణ, కార్యక్రమాల షెడ్యూల్, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్క సమీక్షలు నిర్వహించారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, విద్యా పురోగతి, మహిళల జీవనోపాధి బలోపేతం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యం..
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, సామాజికంగా మరింత శక్తివంతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలువనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మహిళల్లో కొత్త ఆత్మ విశ్వాసాన్ని నింపేలా, మహిళా సాధికారతకు కొత్త దిశా నిర్దేశం చేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజుకు ప్రత్యేక కార్యక్రమాలను మంత్రి సీతక్క నేతృత్వంలోని ఉన్నతాధికారులు రూపొందించారు.
తొలుత సోమవారం (మే 25) రోజున ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 100 గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించనున్నారు. ఇదే రోజు రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా 82 అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తారు. జిల్లా స్థాయిలో లోన్ మేళాలు నిర్వహణ ఉంటుంది. ఈ నెల 26వ తేదీన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 553 ఆర్టీసీ బస్సులను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించనున్నారు. “బాల్య వివాహం బతుకు ఆగం” పేరుతో బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. సామాజిక చైతన్య కార్యక్రమాలు, సోషల్ మొబిలైజేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
27వ జిల్లా కేంద్రాల్లో మహిళా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు, POSH చట్టంపై అవగాహన సదస్సులు, లోకల్ కమిటీలు (LCలు), ఇంటర్నల్ కమిటీలు (ICలు) కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 28వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. 29వ తేదీన మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మానవ అక్రమ రవాణా నిరోధక విధానాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లా స్థాయిలో మహిళా సంఘాల జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాలు, మండల సమాఖ్యల్లో ప్రత్యేక సాధారణ సమావేశాలు నిర్వహించనున్నారు. 30వ తేదీన “అమ్మ మాట అంగన్‌వాడీ బాట” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫార్మ్‌ల పంపిణీ, మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు ఉద్దేశించిన “అమ్మకు అక్షరమాల” కార్యక్రమ విజయోత్సవాలు చేపట్టనున్నారు.

