జనగామ టు సూర్యాపేట: తాగుబోతు ‘ట్రయల్ రన్’!

కలం, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో మనుషులు ఏం చేస్తారో ఊహించడం కష్టం. తాజాగా జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో ఇలాంటి ఒక విచిత్రమైన ఘటనే వెలుగుచూసింది. పూటుగా మద్యం సేవించిన ఒక వ్యక్తి.. ఏకంగా బస్టాండ్‌లో ఆగి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును దొంగిలించి (Drunk Man Steals RTC Bus), కిలోమీటర్ల మేర డ్రైవ్ చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మద్యం మత్తులో జనగామ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ ప్రయాణికులు లేకుండా ఖాళీగా ఆగి ఉన్న ఒక ఆర్టీసీ అద్దె బస్సును గమనించాడు. మత్తు తలకెక్కడంతో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో.. ఆ బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సూర్యాపేట వైపునకు వెళ్లే రహదారిలో ఏకంగా 21 కిలోమీటర్ల మేర బస్సును నడుపుకుంటూ వెళ్లాడు.

అయితే, సింగరాజుపల్లి టోల్‌గేట్ సమీపానికి చేరుకోగానే వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను బస్సు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆగిపోయింది. బస్సు అపహరణకు గురైందని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. టోల్‌గేట్ వద్ద ప్రమాదానికి గురైన బస్సును గుర్తించి, అందులో ఉన్న వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అతడిని విచారించగా వచ్చిన సమాధానం విని వారు సైతం అవాక్కయ్యారు. ‘ఏదో సరదాగా ట్రయల్ వేద్దామని బస్సు నడిపాను సార్’ అంటూ వెంకన్న చాలా కూల్‌గా సమాధానం చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ వింత ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>