Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్‌ నినో ముప్పు.. ఆ జిల్లాల్లో వానలు కష్టమే!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంపై ఎల్ నినో (El Nino) తీవ్ర ప్రభావం చూపనుందా? సాగుకు తిప్పలు తప్పవా? ముందున్నది కష్టకాలమేనా? వాతావరణ శాఖ అంచనాలు, ఇటీవల విడుదలైన శాటిలైట్ చిత్రాలు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, తాజాగా మంత్రి ఉత్తమ్ ఇచ్చిన ఆదేశాలు.. ముప్పు తప్పదని స్పష్టం చేస్తున్నది. నైరుతి రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయాయి. నాలుగురోజులుగా ఎండలు మళ్లీ ముదురుతున్నాయి. బుధవారం చాలా చోట్ల 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. 16 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయినందున కొత్త బోర్‌వెల్స్‌ అనుమతులను నియంత్రించాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇంకోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన శాఖ అధికారులతో రివ్యూ సందర్భంగా.. బాంబు లాంటి వార్త పేల్చారు. తెలంగాణలోని 12 జిల్లాల్లో ఎల్ నినో ముప్పు ఉంటుందని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

12 రాష్ట్రాల్లోని 197 జిల్లాల్లో ప్ర‌భావం..!

అక్కడెక్కడో పసిఫిక్ మహా సముద్రం దగ్గర మొదలైన ఎల్‌ నినో తెలంగాణ దాకా వస్తున్నది. ఈ సంవత్సరం రుతుపవనాల ప్రభావం తక్కువగానే ఉంటుందని, వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని కేంద్ర వాతావరణ విభాగం హెచ్చరించింది. నివేదిక రూపంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహా పలు మంత్రిత్వశాఖలకు తెలియజేసింది. మే నెల చివరినాటికి ఉన్న పరిస్థితుల్లో కనీసంగా 10% మేర వర్షపాతం తగ్గొచ్చని పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది ‘సూపర్ ఎల్‌ నినో’గా మారుతుందని ప్రపంచ వాతావరణ విభాగం కూడా అంచనా వేసింది. ఈ ప్రభావం భారతదేశంలో 12 రాష్ట్రాల్లోని 197 జిల్లాల్లో తీవ్రంగానూ, మరో 129 జిల్లాలో ఒక మేరకు ఉంటుంది. తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్ నినో ముప్పు పొంచి ఉంది. ఇందులో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగినట్లుగానే ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించినంతగా లేదు. పైగా ఇటీవల విడుదలైన శాటిలైట్ చిత్రాల్లో మేఘాల జాడ కూడా కనిపించలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు లేకపోగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో బుధవారం ఎండలు భగ్గుమన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.

ఆగస్టు, సెప్టెంబర్లో ‘సూపర్ ఎల్ నినో’

– ఎల్ నినో ముప్పు 12 రాష్ట్రాల్లోని 326 జిల్లాలపై ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వం. ఇందులో తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
– ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అంచనా. ఆ నెలల్లో ఎల్ నినో ‘సూపర్ ఎల్‌ నినో’గా మారనుంది.
– మాన్‌సూన్ వర్షాలు ఈసారి నార్మల్‌తో పోలిస్తే సగటుతో 10 శాతానికి పైగా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు.

ప్రత్యామ్నాయ పంటలే దిక్కు

– వరి లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనలు చేశారు. పరిస్థితిని రైతులకు అర్థం చేసేలా జిల్లా స్థాయిలో కృషి విజ్ఞాన్ కేంద్ర, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ లాంటి విభాగాలతో సమన్వ సమావేశాలను నిర్వహించాలన్నారు.
– రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆరుతడి పంటలే వేయాలని రైతులకు సూచించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎల్‌ నినో ప్రభావం, తక్కువ వర్షపాతం రీత్యా హార్టికల్చర్ సహా కందులు, తృణధాన్యాలు, పప్పుదినుసులు వంటి పంటలు వేయాలని ప్రసార మాధ్యమాల ద్వారా రైతులకు పిలుపునిచ్చింది.
– ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు భూగర్భ జలమట్టం పడిపోవడం, రిజర్వాయర్లలో వాటర్ లెవెల్స్ కనీస స్థాయికి పడిపోవడం.. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి రైతుల్లో అయోమయం నెలకొన్నది.

జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ!

ఎల్‌ నినో ప్రభావంతో 12 రాష్ట్రాలకు ముప్పు ఉండడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్రమత్తమయ్యారు. రాష్ట్రాలు విడివిడిగా ‘కంటింజెన్సీ ప్లాన్’ రూపొందించుకోవాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలోనూ ఇలాంటి ముందస్తు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌ నినో వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉండే చాన్స్ ఉందని హెచ్చరించారు. తెలంగాణ, ఒడిశా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ‘సాపేక్షంగా తీవ్రంగా’ ఉండవచ్చన్నారు. ప్రభావిత జిల్లాల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలన్నారు.

ఆగస్టు, సెప్టెంబర్ మరింత తీవ్రం

– భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌ నినో వాతావరణ పరిస్థితి భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడడానికి, తక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణమవుతుంది.
– ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో ఎల్‌ నినో మరింత తీవ్రం కానున్నట్లు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల మాన్‌సూన్ వర్షాలు ఈసారి నార్మల్‌తో పోలిస్తే సగటుతో 10 శాతానికి పైగా తగ్గనున్నాయి.
– ఈ పరిస్థితిని వ్యవసాయ అధికారులు ముందుగానే గుర్తించి పంటల సాగులో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసి రైతుల్లో అవగాహన కలిపించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.
– సవాళ్లకు తగినట్లుగా రైతులకు తక్షణ సలహాలు, ప్రత్యామ్నాయ పంటల సూచనలు, అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి అన్నారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు (ఇంటర్‌క్రాపింగ్), ప్రత్యామ్నాయ పంటల నమూనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

గ్రౌండ్ వాటర్ లెవల్స్ డౌన్

రాష్ట్రంలోని 16 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోయాయి. ప్రధాన ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. రుతుపవనాలతో వర్షాలు కురువొచ్చని అంచనా వేసుకున్నా.. ఎల్‌ నినో ప్రభావంతో ఆ ఆశలు అడుగంటాయి. కేంద్ర వాతావరణ విభాగం అంచనా వేసినట్లుగా రాష్ట్రంలో ఎల్‌ నినో ప్రభావానికి గురయ్యే 12 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్ పడిపోయింది. మే నెల చివరి నాటికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని గ్రౌండ్ వాటర్ విభాగం ఆయా జిల్లాల్లో భూగర్భ నీటి మట్టం ఏ మేరకు పడిపోయిందో నివేదిక తయారుచేసింది. ఈ 16 జిల్లాలు ‘వాటర్ స్ట్రెస్’ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నది. మరోవైపు సాగునీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ జిల్లాల్లో కొత్తగా వేసే బోరుబావులకు అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు పకడ్బందీ నియంత్రణా చర్యలు పాటించాలని ఆదేశించారు.

ఏ జిల్లాలో ఎంత లోతులో నీటి లభ్యత ఉన్నది? (గ్రౌండ్ వాటర్ విభాగం నివేదిక ప్రకారం..)

• వికారాబాద్ జిల్లా : 14.45 మీటర్లు
• రంగారెడ్డి జిల్లా : 12.2 మీటర్లు
• మెదక్ జిల్లా : 13.56 మీట్లు
• సంగారెడ్డి జిల్లా : 13.5 మీటర్లు
• భూపాలపల్లి జిల్లా : 13.21 మీటర్లు
• కామారెడ్డి జిల్లా : 13.02 మీటర్లు
• మేడ్చల్ జిల్లా : 12.51 మీటర్లు
• సిద్దిపేట జిల్లా : 11.90 మీటర్లు
• నిజామాబాద్ జిల్లా : 11.9 మీటర్లు
• సిరిసిల్ల జిల్లా : 10.87 మీటర్లు
• కొత్తగూడెం జిల్లా : 10.42 మీటర్లు
• మహబూబ్‌నగర్ జిల్లా : 10.36 మీటర్లు
• సూర్యాపేట్ జిల్లా : 7.24 మీటర్లు
• నల్లగొండ జిల్లా : 7.33 మీటర్లు
• కరీంనగర్ జిల్లా : 8.44 మీటర్లు
• ఖమ్మం జిల్లా : 5.67 మీటర్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>