కలం, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ (Drunk Driving) టెస్టులో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. టెస్టులు చేసే సమయంలో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. టెస్టులు నిర్వహిస్తుండగా.. తాను దొరికిపోతానని భావించిన ఓ బాబాయ్ భయంతో పిల్లల్ని సైతం వదిలి పారిపోయాడు. తన బైక్‌ను రోడ్డుపై వదిలేశాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్ అవ్వగా, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.
అలాగే వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. తాను మద్యం సేవించలేదని, ట్రాఫిక్ పోలీసులు తనపై చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఘటనా స్థలానికి సివిల్ పోలీసులు వచ్చేసరికి ఆ వ్యక్తి పరారయ్యాడు. ఇక హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1198 మంది పట్టుబడ్డారు. నిన్న రాత్రి (డిసెంబర్31) నుంచి ఇవాళ (జనవరి1) తెల్లవారుజాము వరకు పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.


