ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్(Dolby Cinema) హైదరాబాద్‌లో అందుబాటులోకి రాబోతున్నది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోకోపేటలో అల్లు సినీ ఫ్లెక్స్(Allu Cineplex) పేరుతో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. డాల్బీ ల్యాబొరేటరీస్ భారత్‌లో ఏర్పాటు చేస్తున్న ఆరు థియేటర్లలో ఇది కూడా ఒకటి. ఈ ఆరింటిలో అత్యంత అధునాతనమైనది అల్లు సినీ ఫ్లెక్స్ కావడం గమనార్హం.
అల్లు ఫ్యామిలీ గతంలో అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్‌ను విజయవంతంగా నడిపించింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఈ థియేటర్‌ను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ థియేటర్ ప్రారంభించబోతున్నారు. 75 అడుగుల వెడల్పు గల డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కావడం విశేషం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద డిజిటల్ ఐమ్యాక్స్ స్క్రీన్‌ల కంటే కూడా ఇది పెద్దది. డాల్బీ విజువల్, డాల్బీ అట్మాస్ సాంకేతికతలతోపాటు డాల్బీ త్రీడీ, స్టూడియో గ్రేడ్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రపంచస్థాయి నిర్మాణం ఇక్కడ ఉంటుంది.
డాల్బీ థియేటర్లలో అద్భుతమైన, ఊహకందని థియేటర్ అనుభవం పొందొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 34 ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. వాటిన్నింటి కంటే ఈ డాల్బీ స్క్రీన్ ఎంతో ప్రత్యేకమైనది. అధునాతనమైనది. ఇక సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచస్థాయి చిత్రాలు సైతం టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సినిమాలకు ఈ థియేటర్ మంచి అనుభవం ఇవ్వనున్నది. ఈ థియేటర్‌లో ప్రారంభ చిత్రంగా జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న ‘అవతార్ 3 విడుదల చేయబోతున్నారు.
డాల్బీ ప్రత్యేకతలు ఏమిటి?
డాల్బీ సినిమా(Dolby Cinema)లో సాధారణ మల్టీప్లెక్స్ లేదా ఐమ్యాక్స్ కంటే భిన్నంగా సినిమాను అస్వాదించొచ్చు. డాల్బీ థియేటర్లో అద్భుతమైన విజువల్ క్వాలిటీ ఉంటుంది. సాధారణ థియేటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ కలర్ గ్రేడేషన్, బ్రైట్‌నెస్ ఈ థియేటర్లో పొందొచ్చు. గరిష్టంగా 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ (సాధారణ థియేటర్లు 40-50 నిట్స్ మాత్రమే) ఇస్తుంది. పూర్తి నల్లటి బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది. ఒక్కో ఫ్రేమ్‌ను డైనమిక్‌గా కంట్రోల్ చేస్తుంది (డ్యూయల్ 6కే లేజర్ ప్రొజెక్టర్లు వాడతారు).
డాల్బీ అట్మాస్ – 360° సౌండ్
128 సౌండ్ చానెల్స్ + 64 స్పీకర్లు (సాధారణ థియేటర్లలో 5.1 లేదా 7.1 మాత్రమే). హెలికాప్టర్ వెళ్లే పోయే సన్నివేశాల్లో నిజంగానే హెలీక్యాప్టర్ మన మీద నుంచి పోతున్న అనుభవం ఇస్తుంది. వర్షం కురుస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. గోడలు, సీలింగ్, సీట్లు అన్నీ మాట్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. లైట్ రిఫ్లెక్షన్ ఉండదు. స్క్రీన్ మీద మాత్రమే కాంతి పడుతుంది. థియేటర్ లోపలికి వెళ్తే చీకటి గుహలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక ఇటువంటి థియేటర్ హైదరాబాద్‌లో నిర్మాణం అవుతుండటంతో సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఇక్కడ టికెట్ ధరలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి.
Read Also: రజనీకాంత్, బాలకృష్ణ లకి అరుదైన గౌరవం
Follow Us on: Youtube

