Maredumilli Encounter | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ(Devuji) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం ప్రాంతమంతా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్(Maredumilli Encounter) విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధృవీకరించారు. “మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం” అని ఆయన తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… మావోయిస్టులు అవకాశమున్నంత వరకు లొంగిపోయి ప్రధానస్రవంతిలోకి రావాలని సూచించారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాలు మోహరించిన విషయం తెలిసిందే. దీంతో మావోయిస్టులు ఏపీ వైపునకు కదులుతున్నారు. వారు ఏపీలోని మారేడుమిల్లి అటవీప్రాంతానికి వస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ చేపడుతున్నారు.
Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ హైదరాబాద్‌లో
Follow Us on: Youtube

