కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత (Gas Shortage) కష్టాలు తీరబోతున్నాయి. గురువారం ఉదయం ఓ భారీ ఎల్‌పీజీ నౌక తన గమ్యస్థానాన్ని మార్చుకొని విశాఖపట్నం (Visakhapatnam) పోర్టుకు చేరుకుంది. 47,000 టన్నుల ఎల్‌పీజీతో పైన్ గ్యాస్ అనే భారీ ట్యాంకర్ నేడు ఒడిశాలోని ధామ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నౌకను తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం దారి మళ్లించి విశాఖకు తీసుకొచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల్లో వంటగ్యాస్ కొరత తగ్గనుందని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎల్‌పీజీ, సహజ వాయువు నౌకలకు విశాఖ పోర్టులో బెర్తింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఈ నౌక ప్రయాణం ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. యూఏఈలోని ఘంటూట్ నుంచి బయలుదేరిన ఈ నౌక, ఇరాన్ దిగ్బంధం విధించిన కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా క్షేమంగా ప్రయాణించి భారత తీరానికి చేరుకుంది. సముద్ర పరిస్థితులు, నిర్వహణ కారణాల దృష్ట్యా సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించేందుకు ధామ్రాకు బదులుగా విశాఖను ఎంచుకున్నారు. విశాఖ (Visakhapatnam) పోర్టులో పెసో ప్రమాణాలకు అనుగుణంగా గ్యాస్ హ్యాండ్లింగ్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని, ఈ నౌక రాకతో వంట గ్యాస్ అవసరాలకు కొంత ఊరట లభిస్తుందని అధికారులు వెల్లడించారు.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On: Instagram

