కలం, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ (TVK Vijay)కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంపై డీఎంకే (DMK) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా తమిళనాడులోని మయిలాడుదురైలో కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంపై డీఎంకే కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ జెండాలను రోడ్డుపై పడేసి, కార్యకర్తలను ఉరికించి కొట్టారు. దీంతో రోడ్డుపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను మోసం చేసి విజయ్‌కి ఎలా మద్దతు ఇస్తారని డీఎంకే కార్యకర్తలు నినాదాలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని నినాదాలు చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ తీరుతో డీఎంకే అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించింది. లోక్‌సభలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు లేఖ కూడా రాసింది. విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల తమిళనాడు రాజకీయాల్లో ఏళ్ల తరబడి ఉన్న కాంగ్రెస్, డీఎంకే బంధం ఒక్కసారిగా తెగిపోయింది. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

