2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: సీఎం రేవంత్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కొడంగల్ – నారాయణ పేట ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌ (Kodangal) లో రూ. 110 కోట్ల వ్యయంతో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర ఆలయం పునర్నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా నారాయణ పేట, కొడంగల్ ప్రాంతాలు సాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయని, పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో తొక్కిపెట్టిన కొడంగల్, నారాయణ పేట లిఫ్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశానన్నారు. ఈ లిఫ్ట్ పనులు మీరో ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు కొలిక్కి వచ్చాయని, ఇంకా కొన్ని చోట్ల భూ సేకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగిస్తున్నానని ప్రకటించారు.

భూమి సేకరించే గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడి లిఫ్ట్ పనులకు అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మంత్రి శ్రీహరిదే అని సీఎం అన్నారు. రైతులకు భూ పరిహారం అందించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని, అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా భూ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రాంతం విద్యా, పరిశ్రమల హబ్‌గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. టేకులకోడ్ వద్ద సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆరు నెలల్లో ఈ పరిశ్రమ పనులు పూర్తి అవుతాయన్నారు.

లగచెర్ల ప్రాంతంలో విద్యా హబ్‌ను ఏర్పాటు చేస్తామని, ఇక్కడ కేజీ to పీజీ వరకు విద్యార్థులు చదువుకునేందుకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కొడంగల్ ప్రాంతంలో మెడికల్, ఇంజినీరింగ్, ఐఐఐటీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తున్నామని సీఎం అన్నారు. విద్యలో వెనుకబడిన కొడంగల్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్ పనులు రెండు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఆమోదం లభించిందని, వెంటనే పనులు పూర్తవుతాయన్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే కొడంగల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.

2034 వరకు మనదే అధికారం :

2034 వరకు మనమే అధికారంలో ఉంటామని, కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలోని తండాలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదని, తాను మొదట్లో కొడంగల్ ఎమ్మెల్యే అయిన తరువాత ప్రతి తండాకు రోడ్ల సౌకర్యం కల్పించామన్నారు. కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు రాష్ట్ర మంత్రుల సహకారంతో ముందుకెళ్తున్నానని సీఎం పేర్కొన్నారు. ఇక్కడి రహదారులను ముంబై, పూణే రహదారుల తరహాలో మార్చుతానన్నారు. ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>