కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై జిల్లా ఆరోగ్యాధికారి డా. తుకారాం రాథోడ్ (DMHO Tukaram Rathod) కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణానైనా ఆసుపత్రులను తనిఖీ చేస్తానని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. జిల్లా ఆరోగ్య సూచికల్లో భద్రాద్రి కొత్తగూడెంను మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఆసుపత్రులకు వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా, సానుభూతితో ప్రవర్తించాలని డిఎంహెచ్ఓ తుకారాం (DMHO Tukaram Rathod) సూచించారు. పాము కాటు, కుక్క కాటు వంటి అత్యవసర చికిత్సలకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరిపడా నిల్వలో ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే తలసేమియా, హెచ్ఐవీ, క్షయవ్యాధి వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆరోగ్యాధికారి సాయి కల్యాణ్, డాక్టర్‌లు, ఫార్మసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Also: తేనె పవర్ అంతా ఇంతా కాదు.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Follow Us On: X(Twitter)

