కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో రేగిన వివాదానికి తెరపడింది. ముఖ్యమంత్రి మార్పు వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యే ఉంటారని.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక ముఖ్యమంత్రి మార్పు వార్తలకు దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టే. చాలా రోజులుగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం తెరమీదకు వస్తున్న విషయం తెలిసిందే. ముందు కుదుర్చుకున్న అనధికారిక ఒప్పందం ప్రకారం .. మొదటి రెండున్నర ఏండ్లు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఇప్పుడిక డీకే శివకుమార్ వంతు అని ఆయన వర్గీయులు భావించారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసినట్టు వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్, సిద్దరామయ్య(Siddaramaiah) ఢిల్లీ పర్యటనలో ఉండటం వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే సిద్దరామయ్య పదవిని వదులుకొనేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఇక చేసేది లేక డీకే శివకుమార్ కూడా మౌనంగా ఉండిపోయారట. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
నవంబర్ 20, 2025 నాటికి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవి మార్పుపై తీవ్ర ప్రచారం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య “రెండున్నరేళ్లకు అధికార పంపిణీ” ఉందని అనధికారికంగా చర్చ జరిగింది. దీని ప్రకారం, రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్ సీఎం కావాల్సి ఉందని ఆయన మద్దతుదారులు భావించారు.
డీకే శివకుమార్ మద్దతుదారులు 10-15 మంది ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ (రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే)ను కలిసి డీకేను సీఎంగా చేయాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కూడా “సిద్ధరామయ్య మాట ఇచ్చారు, ఆయన మాట తప్పరు” అంటూ పరోక్షంగా మాట్లాడారు. సిద్ధరామయ్య మద్దతుదారులు మాత్రం “సీఎం మార్పు ఉండదు’ అంటూ చెబుతూ వచ్చారు.
DK Shivakumar ఎక్స్ పోస్ట్‌తో క్లారిటీ
శుక్రవారం సీఎం డీకే శివకుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి ఊహాగానాలకు తెరదించారు. ‘మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే. గ్రూపులు ఏర్పాటు చేయడం నా రక్తంలోనే లేదు. సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (క్యాబినెట్ రీషఫుల్) చేపట్టనున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు తమ వంతు ప్రయత్నాల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. అది సహజం. సీఎం స్పష్టంగా చెప్పారు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని. ఆయనకు మేమంతా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం అయినా నేనైనా పదే పదే చెప్పేది ఒక్కటే. హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం.’ అంటూ డీకే పోస్ట్ పెట్టారు. దీంతో ముఖ్యమంత్రి మార్పు వార్తలకు దాదాపు బ్రేక్ పడ్డట్టే.
డీకే ప్రయత్నాలు కొనసాగిస్తారా?
డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని ఉంది. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది. నిజానికి డీకే కాంగ్రెస్ పార్టీకి అత్యంత వీర విధేయుడు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. పైగా వివిధ రాష్ట్రాల్లో వరస ఓటములు చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు లాంటి కీలక నిర్ణయాలు తీసుకోనే సాహసం చేయకపోవచ్చు. అందుకే పరిస్థితిని అర్థం చేసుకున్న డీకే వెనక్కి తగ్గారు. కర్ణాటకలో ప్రభుత్వం స్థిరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు కాబట్టి.. తాను ఆశను చంపుకొని సిద్దరామయ్యకు మద్దతు పలికారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Also: SIRపై మమతా బెనర్జీ లేఖ.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
Follow Us on: Youtube


