కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వాలు మారినా, కొత్త పథకాలు వచ్చినా.. క్షేత్రస్థాయిలో అర్హులైన పేదల తలరాతలు మారడం లేదు. అన్ని అర్హతలున్నా.. పింఛన్ కోసం ప్రతి అధికారిని వేడుకుంటున్న వ్యక్తి దీనగాథ ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలోని 7వ డివిజన్ వనమా కాలనీలో మాదల శిరోమణి, కుమారుడు మాదల కోటితో కలిసి జీవిస్తోంది. ఒకప్పుడు లారీ డ్రైవర్‌గా చురుగ్గా ఉంటూ, కుటుంబాన్ని పోషించిన కోటి ఆరు సంవత్సరాల కిందట తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో పాటు మానసిక స్థితిని కూడా దెబ్బతీసింది. ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోయి, కనీసం దైనందిన పనులు కూడా చేసుకోలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యులు అతడికి 75 శాతం వికలాంగత్వం ఉన్నట్లు ధ్రువీకరించి, సదరం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు.
ఆసరా దొరుకుతుందని ఆశపడితే..
ప్రభుత్వం అందించే పింఛన్‌కు సదరం ధ్రువపత్రమే ఆధారం కావడంతో, ఇక తనకు కొంత ఆసరా దొరుకుతుందని ఆ తల్లి ఆశపడింది. కానీ, నాలుగేళ్లుగా పాల్వంచ మున్సిపల్ కార్యాలయం, కొత్తగూడెంలోని కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి. ప్రజావాణితో సహా అధికారుల చేతుల్లో డజన్ల కొద్దీ దరఖాస్తులు పెట్టినా ఒక్కరు కూడా కనికరించలేదు. ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొత్త పెన్షన్ల మంజూరులో దివ్యాంగులకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. 75 శాతం వైకల్యంతో నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్న మాదల కోటి మాత్రం ఇంకా జాబితాకు వెలుపలే ఉండిపోవడం గమనార్హం. మానవతా దృక్పథంతో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని, మాదల కోటికి తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అన్నం పెట్టలేకపోతున్నా: శిరోమణి
“నా కొడుకు లారీ నడిపి మమ్మల్ని పోషించేవాడు. ఇప్పుడు వాడు మంచాన పడితే, ఈ వయసులో అన్నం పెట్టలేక, మందులు కొనలేక నరకం చూస్తున్నాం. మేము బతికుండగానే ఇంత దయనీయంగా ఉంటే, నా తరువాత నా కొడుకు గతి ఏంటి?” అంటూ శిరోమణి కన్నీటి పర్యంతమవడం హృదయాన్ని కలచివేస్తోంది. ఇంత ఇబ్బందుల్లోనూ శిరోమణి తన కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటుండటం అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

