కలం, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు, ఇటీవలే ‘ధురంధర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కు బెదిరింపులు వచ్చాయి. రూ.కోట్లు ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు రణ్వీర్ వాట్సాప్‌కు వాయిస్ మెసేజ్ పంపాడు. తనని తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్న ఆగంతకుడు డబ్బు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీనిపై రణ్వీర్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాయిస్ మెసేజ్లోని గొంతు ఎవరిదో గుర్తు పట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపారు. ముందు జాగ్రతగా ముంబైలోని రణ్వీర్, దీపిక పదుకొనే దంపతుల ఇంటి వద్ద భద్రత పెంచారు.
కాగా, ఆదివారం(ఫిబ్రవరి 8న) బాలీవుడ్ ప్రొడ్యూసర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి కారణం తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులోనూ ఇదే విషయం తేలింది. కాల్పులు జరిపిన వ్యక్తికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కు బెదిరింపు రావడం బాలీవుడ్లో ఆందోళన కలిగిస్తోంది.
అయితే, బాలీవుడ్ నటులకు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. దావూద్ ఇబ్రహీం, అబూ సలేం వంటి అండర్ వరల్డ్ డాన్స్ నుంచి బాలీవుడ్ నటులు బెదిరింపులు ఎదుర్కొన్నారు. టీ–సిరీస్ అధినేత గుల్షన్ కుమార్‌ను ముంబైలో కాల్చి చంపడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read Also: కోచ్ అవతారమెత్తిన మిస్బా ఉల్ హక్
Follow Us On: Instagram


