epaper
Wednesday, February 18, 2026
epaper

ఖమ్మంలో కాంగ్రెస్ అరాచక పాలన : బీఆర్ఎస్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) గడ్డ పై కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతున్నదని బీఆర్​ఎస్ పార్టీ నేతలు తాత మధుసూదన్, వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra), కందాల ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి, ప్రస్తుత కాంగ్రెస్ అరాచక పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్​ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రలోభాలకు గురిచేస్తూ నాయకులను పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి, “ఓటు వేయకపోతే బొక్కలో వేస్తాం” అంటూ ఓటర్లను, ప్రతిపక్ష నేతలను బహిరంగంగా బెదిరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. “ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి?” అని మంత్రులను నిలదీశారు. గతంలో కేసీఆర్ కేబినెట్‌లో పనిచేసిన మంత్రులు నేడు వ్యవస్థలు ధ్వంసమయ్యాయని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ‘అనాడు భక్త రామదాసు ప్రాజెక్టు కట్టింది మీరు కాదా? అప్పుడు వ్యవస్థలు పని చేయలేదా?’ అని ప్రశ్నించారు.

పాలేరులో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తెచ్చిన జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలకు ఇప్పుడు రిబ్బన్లు కట్ చేయడం తప్ప, ఈ మంత్రులు జిల్లాకు కొత్తగా తెచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ మధిర పట్టణాన్ని ‘మినీ సింగపూర్’ చేస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, క్షేత్రస్థాయిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందన్నారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు హామీలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు.

రెవెన్యూ మంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వార్డుల వారీగా ఓట్ల సమీక్ష చేయడంపై బీఆర్​ఎస్​ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ కాంగ్రెస్ ఏజెంట్లుగా మారుతున్న అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. అటువంటి అధికారులను వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాబలం ముందు పోలీసు బలగం పనిచేయదని, డబ్బుతో కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్​ నాయకులు హెచ్చరించారు.

Read Also: అర్జున్​ టెండూల్కర్ పెళ్లి.. ప్రధానికి సచిన్​ ఆహ్వానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>