కలం, వెబ్ డెస్క్: తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అమరావతి (Amaravati) రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారని ఆగ్రహించారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని (Amaravati) శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారని దుయ్యబట్టారు. అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదని చెప్పారు. విభజన చట్టం స్పష్టంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని చెప్పిందని అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు (Chandrababu) పెడచెవిన పెడుతున్నారని ధర్మాన ఫైర్ అయ్యారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగిందన్నారు. మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? అని ప్రశ్నించారు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదు? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా? అని ధర్మాన (Dharmana Prasada Rao) ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కూడా ఇవ్వరా? అని ఫైర్ అయ్యారు. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అంతకాలం ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన నిర్ణయాలను చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు.
Read Also: పంజాబీ నటి ప్రేమలో భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్
Follow Us On : WhatsApp

