ఐటీ ఉద్యోగుల భద్రతపై బండి ఆందోళన.. తెలంగాణ డీజీపీ రియాక్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఎక్స్ వేదిక‌గా చేసిన ఓ పోస్టుపై తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి (DGP Shivadhar Reddy) స్పందించారు. నాసిక్‌లో ఐటీ కంపెనీలో వేధింపుల ఘ‌ట‌న‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, దీనిపై తెలంగాణ డీజీపీ త‌క్ష‌ణ‌మే ఐటీ కంపెనీల అధిప‌తుల‌తో స‌మావేశం కావాల‌ని బండి సంజ‌య్ కోరారు. ఐటీ కంపెనీల్లో వేధింపులు, మ‌త‌ప‌ర క‌క్ష‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని సూచించారు. బాధితుల ఫిర్యాదుల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించ‌కూడ‌ద‌ని డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడానికి పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్ బలం దాని వైవిధ్యంలోనే ఉందని, విభిన్న ప్రాంతాలు, మతాలకు చెందిన లక్షలాది మంది వృత్తి నిపుణులు నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ అందరూ సామరస్యంతో, పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు.

ఐటీ రంగంలో భద్రత కోసం ఇప్పటికే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ద్వారా పరిశ్రమలతో కలిసి పని చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్స్, షీ షటిల్ సర్వీసులు, హాస్టళ్ల భద్రతా తనిఖీలు, మార్గదర్శక్ వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఫిర్యాదును సీరియ‌స్‌గా తీసుకొని, సత్వర చర్యలు చేపడుతున్నామని, రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుతూ పారిశ్రామిక వేత్తలు, ప్రజలతో కలిసి భద్రతను పర్యవేక్షిస్తామని ఆయన బదులిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>