హైడ్రా కూల్చివేత చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఐలాపూర్ ప్రాంతంలో రెండు రోజులుగా హైడ్రా తొలగిస్తున్న అక్రమ ఆక్రమణలు, నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. నీటి వనరుల ఆక్రమణలు మినహా, ఇతర నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. హైడ్రా (HYDRAA) చర్యలపై హైకోర్టులో వందలాది కేసులు దాఖలవుతుండటంపై అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం విచారణ సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను ఆక్రమించినట్లయితే వాటిని హైడ్రా తొలగించవచ్చునని స్పష్టం చేశారు. నాలాలు, పార్కులు, బహిరంగ రహదారుల పునరుద్ధరణ కోసం కూడా అక్రమ ఆక్రమణలను కూల్చివేయవచ్చని పేర్కొన్నారు. కానీ అనుమతి లేని నిర్మాణాలు, అంతర్గత రహదారులు, కాంపౌండ్ వాల్స్ వంటి భవనాలు, నిర్మాణాల విషయంలో మాత్రం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని నొక్కిచెప్పారు. జీహెచ్ఎంసీ లేదా స్థానిక మున్సిపాలిటీ చట్టాలకు లోబడి సరైన మార్గదర్శకాలను కోర్టు ముందు ఉంచేంత వరకు వీటి జోలికి వెళ్ళవద్దని ఆదేశించారు. భవనాలు, నిర్మాణాలను కూల్చివేసే ముందు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది కళ్ళు మూసుకుని ఉండి, ఇప్పుడు నిబంధనల ఉల్లంఘన అని కోర్టుకు వివరణ ఇవ్వడం సరికాదన్నారు. యాజమాన్య హక్కుల వివాదాలు ఉన్నప్పుడు లేదా సుదీర్ఘకాలంగా ఆ స్థలంలో నివాసం ఉంటున్నప్పుడు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని హైడ్రాకు స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేశారు. అప్పటివరకు నీటి వనరులు మినహా ఇతర అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లవద్దని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>