కలం, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా 13 వేల మంది గిరిజనులతో నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల కరీంనగర్ లో బిజెపి ఎస్టి మోర్చా (BJP ST Morcha) సంబరాలు చేసుకుంది.
జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్లో సంబరాలు నిర్వహించారు. గిరిజన కళలకు ప్రపంచ స్థాయిలో లభించిన అరుదైన గౌరవాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా బిజెపి ఎస్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ వేదికపై వెలుగులు విరజిమ్మడం గర్వకారణమన్నారు. ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ చొరవతో గిరిజన కళలకు ఈ గుర్తింపు దక్కిందని కొనియాడారు. థింసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లభించడం మరువలేని అనుభూతిలాంటిది అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్, పెద్దపల్లి జితేందర్, నాయకులు కటకం లోకేష్, ఉప్పరపల్లి శ్రీనివాస్, గుంజేటి శివకుమార్, నరేష్, గుగులోతు శ్రీకాంత్ నాయక్, కట్ట రాజు, ఇస్లావత్ శ్రీనివాస్ నాయక్ , ఎస్టి మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

