కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా పంచాయతీ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శుల బదిలీలతో పాటు డిప్యూటేషన్‌లు చేపట్టారు. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. జిల్లా (Jangaon) లోని వివిధ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 90 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి బదిలీ చేశారు. కొంతమందిని డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించగా, అవసరమైన చోట్ల అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
ప్రత్యేకంగా తరిగొప్పుల మండలంలోని ఖాళీ గ్రామపంచాయతీలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. గ్రామస్థాయిలో పరిపాలనను మెరుగుపరచడం, పనితీరును వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బదిలీ అయిన కార్యదర్శులు 24 గంటలలోపు కొత్త స్థానాల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు వారి జాయినింగ్ వివరాలను తక్షణమే నివేదించాలని సూచించారు. ఈ బదిలీలతో గ్రామపంచాయతీలలో సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

