బియ్యం ఎప్పుడొస్తుంది?.. రోజూ రేషన్ షాపుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు!

కలం, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి మూడు నెలలకు సరిపడా పీడీఎస్ సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు ఉపశమనం పొందుతామని ఆశించారు. అయితే ప్రకటన వెలువడి నాలుగు రోజులు గడిచినా జిల్లా కేంద్రం వనపర్తి (Wanaparthy) పట్టణంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆగస్టు 4వ తేదీ నాటికీ పట్టణంలోని 22 రేషన్ దుకాణాలకు రేషన్ సన్నబియ్యం చేరకపోవడంతో వేలాది మంది లబ్ధిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

రోజూ రేషన్ దుకాణాలకు వచ్చే ప్రజలు “బియ్యం ఎప్పుడు వస్తుంది… ఎప్పుడు పంపిణీ చేస్తారు?” అంటూ డీలర్లను ప్రశ్నిస్తున్నారు. అయితే తమకు ఇప్పటివరకు సరుకు అందలేదని చెప్పడం తప్ప మరో మార్గం లేదని డీలర్లు వాపోతున్నారు. కొన్నిచోట్ల గత నెల మిగిలిన రేషన్ బియ్యం ఉండడంతో రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ షాపుల్లో బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియక రోజూ ఎదురుచూడాల్సిన పరిస్థితి లబ్ధిదారులకు ఏర్పడింది. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి తిరిగి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. కొందరు సమీప గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు వెళ్లి అక్కడి నుంచి బియ్యం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వనపర్తి జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.83 లక్షల రేషన్ కార్డులు ఉండగా, దాదాపు 6.20 లక్షల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం అంత్యోదయ ఆహార భద్రత కార్డు(AFSC), ఆహార భద్రత కార్డు (FSC), అంత్యోదయ అన్న యోజన కార్డు(AAP) అనే మూడు రకాల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. అంత్యోదయ ఆహార భద్రత కార్డు కలిగిన వారికి వ్యక్తికి 35 కిలోలు, ఎఫ్‌ఎస్‌సీ కార్డు కలిగిన వారికి వ్యక్తికి 6 కిలోలు, ఏఏపి కార్డు కలిగిన కుటుంబాలకు 10 కిలోల బియ్యం ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల బియ్యం ఒకేసారి అందుతుందనే ఆశతో ఉన్న లబ్ధిదారులకు ఆలస్యం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 11,715.327 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలించాల్సి ఉంది. కొన్ని మండలాల్లో సరఫరా ప్రారంభమైనప్పటికీ, జిల్లా ప్రధాన కేంద్రంలో రేషన్ దుకాణాలకు బియ్యం చేరకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పథకం విజయవంతం కావాలంటే ముందస్తు రవాణా, గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు సరుకు తరలింపు, స్థానిక అధికారుల సమన్వయం అత్యంత కీలకం. అయితే వనపర్తి పట్టణంలో సంబధిత శాఖల సమన్వయ వైఫల్యమే, రవాణా వైఫల్యమే కానీ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు ఆలస్యం కావడంతో సంక్షేమ పథకాలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉపాధి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ బియ్యం ప్రధాన ఆధారం. అలాంటి సమయంలో సరఫరాలో జాప్యం వల్ల అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే వనపర్తి పట్టణంలోని అన్ని 22 రేషన్ దుకాణాలకు అత్యవసరంగా రేషన్ సన్నబియ్యాన్ని సరఫరా చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ పూర్తిచేయాలని లబ్ధిదారులు ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఆంజనేయులు వివరణ

ఆన్లైన్ మూవ్‌మెంట్ ప్రక్రియ కొంత మందగించడం వల్ల రేషన్ బియ్యం సరఫరాలో స్వల్ప జాప్యం ఏర్పడిందని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు . ఈ విషయాన్ని గుర్తించి సంబంధిత సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు. పట్టణంలోని అన్ని రేషన్ దుకాణాలకు రేషన్ సన్నబియ్యం రేపటిలోగా (బుధవారం) చేరేలా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సరఫరా ప్రక్రియ కొంత సమయం తీసుకుంటోందని వెల్లడించారు. అయితే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ అందేలా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం మూడు నెలల రేషన్ సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడం లబ్ధిదారులకు ప్రయోజనకరమైన వనపర్తి జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చు రామకృష్ణ అన్నారు. అధికారులు ముందస్తు ప్రణాళికతో రేషన్ డీలర్లకు బియ్యం సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం లబ్ధిదారులు బియ్యం ఎప్పుడు వస్తుందనే విషయంపై రేషన్ దుకాణాలకు వచ్చి అడుగుతుండటంతో డీలర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. సన్న బియ్యం రేషన్ దుకాణాలకు చేరిన వెంటనే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పంపిణీ చేసే బాధ్యతను తాము సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. ప్రజల అవసరాలు, పంపిణీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుగానే బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటే పంపిణీ ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని వెల్లడించారు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు డీలర్లపై అనవసర ఒత్తిడి కూడా తగ్గుతుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>