కలం, దేవరకొండ: రైతు సంక్షేమం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) స్పష్టం చేశారు. శుక్రవారం దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాలో మైత్రి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద రైతులకు వెయ్యి క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా వరి వేసి ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు. నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
చెక్‌డ్యామ్‌లతో ఎంతో మేలు..
మర్రిచెట్టుతండా గ్రామ పరిధిలో రూ.4.07 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఎమ్మెల్యే బాలు నాయక్ పరిశీలించారు. చెక్‌డ్యామ్‌లు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయానికి ఎంతో కీలకమైనవని, రైతులతో పాటు పశుపక్షాదుల దాహార్తిని కూడా తీరుస్తాయని వివరించారు. దేవరకొండ పట్టణంలో పదో వార్డులో రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
పట్టణంలో రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలిగిపోతాయని, పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో పున్న శైలజ, వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నర్సింహా, మారుపాకుల సురేష్ గౌడ్, హనుమంతు వెంకటేష్ గౌడ్, దొంతినేని వెంకటేశ్వరరావు, దొండేటి మల్లారెడ్డి, కొర్ర రాంసింగ్ నాయక్, నేనావత్ గీత జైలాల్ పాల్గొన్నారు.

