దూసరాకు షాక్.. గంగూలీకి రూ.2కోట్ల పరిహారం

కలం, స్పోర్ట్స్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పర్సనాలిటీ హక్కులకు ‘దూసరా’ సినిమా భంగం కలిగించినట్లు ఢిల్లీ హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలకు (Doosra Producers) కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా రూ.2 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని సూచించింది. అయితే సినిమా థియేటర్లలో ప్రదర్శనను నిలిపివేయాలన్న గంగూలీ విజ్ఞప్తిని మాత్రం తిరస్కరించింది.

రెండు వారాల్లో రూ.2 కోట్ల గ్యారంటీ

జస్టిస్ తేజ్‌స్ కారియా ఈ కేసును విచారించారు. సినిమాలోని కథతో గంగూలీ వ్యక్తిత్వం, ప్రచార హక్కులు ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల వివాదాస్పద అంశాలను మాత్రమే తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘దూసరా’ నిర్మాతలు రమేశ్ డియో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వారాల్లోగా రిజిస్ట్రార్‌కు రూ.2 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది.

సినిమా ప్రారంభంలో, ముగింపులో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్పష్టమైన డిస్‌క్లైమర్లు ఇవ్వాలని కూడా సూచించింది. గంగూలీ తన వ్యక్తిత్వాన్ని సినిమాలో ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేదని, ఆయన హక్కులను ఉల్లంఘించే ఉద్దేశం సినిమాకు లేదని వాటిలో పేర్కొనాలి. ఈ ఆదేశాలను రెండు రోజుల్లో అమలు చేయాలి. ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా సినిమా లేదా దానిలోని అంశాలను వాణిజ్యపరంగా ఉపయోగించకుండా నిర్మాతలను, వారి తరఫున వ్యవహరించే వారిని నిలువరించవచ్చని కోర్టు హెచ్చరించింది.

లార్డ్స్‌లో షర్ట్‌లెస్ సెలబ్రేషన్‌పై అభ్యంతరం

గంగూలీ, లవ్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీ కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గంగూలీ పేరు, ఫొటో, పోలిక, క్రికెట్ కెరీర్‌లోని కీలక ఘట్టాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని వారు ఆరోపించారు. సినిమా థియేటర్లలోనే కాకుండా డిజిటల్, ఇతర వేదికల్లో విడుదల కాకుండా ఆపాలని కోరారు. ప్రచార సామగ్రి పంపిణీని కూడా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

2002లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ మైదానంలో భారత్ సాధించిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ విజయం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఆ విజయానంతరం బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పి సంబరాలు చేసుకున్న ఘటనను సినిమాలో ప్రస్తావించారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ అంశాలతో పాటు గంగూలీ కెప్టెన్సీ, కెరీర్‌లోని కీలక ఘట్టాలను కూడా సినిమా ప్రచారంలో ఉపయోగించారని ఆరోపించారు.

అక్టోబర్ 12న విడుదలైన ట్రైలర్, ప్రచార కార్యక్రమాలతో పాటు.. అక్టోబర్ 13న దర్శకుడు అభినయ్ దేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. నాట్‌వెస్ట్ ఫైనల్, గంగూలీ కెరీర్‌లోని ఘట్టాలు సినిమాలోని తారా అనే కల్పిత పాత్రకు ప్రేరణగా నిలిచాయని దర్శకుడు చెప్పినట్లు వివరించారు.

గంగూలీ బయోపిక్ హక్కులపైనా వివాదం

ఈ కేసులో మరో కీలక అంశం గంగూలీ, లవ్ ఫిల్మ్స్ మధ్య ఉన్న ఒప్పందం. 2021 ఆగస్టు 5న ఈ నిర్మాణ సంస్థతో గంగూలీ ఒప్పందం చేసుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. తన జీవితం, క్రికెట్ కెరీర్ ఆధారంగా బయోపిక్‌తో పాటు ఆడియో, వీడియో కంటెంట్‌ను రూపొందించి వాణిజ్యపరంగా వినియోగించుకునే ప్రత్యేక హక్కులను సంస్థకు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ పేరుతో బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు లవ్ ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ సినిమా 2027 మే 14న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ పేర్కొంది.

‘దూసరా’ సినిమాలో గంగూలీ కెరీర్, వ్యక్తిగత గుర్తింపుతో ముడిపడిన అంశాలను అనుమతి లేకుండా వాడటం వల్ల ఆయన వ్యక్తిత్వ హక్కులతో పాటు, తమకు ఉన్న ప్రత్యేక ఒప్పంద హక్కులు కూడా దెబ్బతిన్నాయని గంగూలీ, లవ్ ఫిల్మ్స్ వాదించారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను ఆపకపోయినా, నిర్మాతలకు బ్యాంక్ గ్యారంటీ, డిస్‌క్లైమర్లపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>