మద్యం తాగి స్కూల్‌ బస్సు నడిపితే.. జైలు శిక్ష: సీపీ శ్వేత

కలం, హనుమకొండ: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత (Warangal CP Swetha) హెచ్చరించారు. మద్యం సేవించి స్కూల్‌ బస్సులు నడిపే డ్రైవర్లపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మద్యం మత్తులో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు నడుపుతూ పట్టుబడిన డ్రైవర్‌కు కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించడం ఈ వ్యవహారంలో తీవ్రతను చాటుతోంది.

కాజీపేట ట్రాఫిక్‌ పోలీసులు గురువారం నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొత్తం 14 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వీరిలో ఒకరు అధిక మోతాదులో మద్యం సేవించి ప్రైవేట్‌ పాఠశాల బస్సు నడుపుతున్నట్లు గుర్తించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో అతడిని పరకాల సబ్‌జైలుకు తరలించారు. మిగిలిన వారికి జరిమానా విధించారు.

ఇదే తనిఖీల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న ఆరుగురు మైనర్లను పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఎం.డి.ఫారియా ఒకరోజు జువైనల్‌ హోంకు పంపాలని ఆదేశించారు.

రోజూ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు తప్పనిసరి

ఈ ఘటన నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యాలకు సీపీ శ్వేత కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు బ్రీత్‌ అనలైజర్‌ పరికరాలు కొనుగోలు చేసి, ప్రతిరోజూ విధులకు హాజరయ్యే డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించిన తర్వాతే బస్సులు, వ్యాన్లు నడిపేందుకు అనుమతించాలని సూచించారు. డ్రైవర్ల లైసెన్సులు, అర్హతలు, వాహనాల ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపేవారి డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దుకు కూడా చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ రాయల ప్రభువు ప్రభాకర్‌రావు, ట్రాఫిక్‌ ఏసీపీ టి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>