కలం, కరీంనగర్ : నగరంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తకముందే మున్సిపల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు (Paidipalli Raju) కోరారు. నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగరం గణనీయంగా విస్తరించి, అనూహ్య మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావం అధికమవుతున్న తరుణంలో మంచినీటి కష్టాలు రాకముందే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి వాడకంపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
నగర విస్తీర్ణం గతంలో కంటే రెట్టింపు అయిందని, అదే స్థాయిలో నీటి వినియోగం కూడా పెరిగిందని తెలిపారు. నీటి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, నగరానికి సరఫరా అవుతున్న నీటితో పాటు వ్యక్తిగత బోర్లు, అపార్ట్మెంట్ బోర్లపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు ఇదే విధంగా తగ్గుతూ పోతే మొదట బోర్లలో నీటి ప్రవాహం తగ్గుతుందని, దీంతో మోటార్ల ద్వారా నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవికాలంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
నగరంలో ఖాళీ స్థలాలు తగ్గడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. చెరువులు, కుంటలు, నాలాలు నీటి సంరక్షణకు ఉపయోగపడేలా పునరుద్ధరించకపోతే భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పూడికతీత, సహజ నీటి మార్గాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు ప్రస్తుత ఎల్నినో పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకొని భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో అధికారులు పర్యటించి నీటి అవసరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని, నీటి శుద్ధి కేంద్రాలు, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.

