అమరావతి పునరుద్ధరణ.. రైతుల త్యాగానికి గౌరవం : పవన్ కల్యాణ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి (Amaravati) ని ప్రకటిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందటంతో, సంవత్సరాలుగా కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాలిక ఆశయాలకు న్యాయం చేసిన చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. త్యాగాలకు సాక్ష్యమైన నేల, ఆశలను మోసిన కన్నీళ్లు, అనిశ్చితిని భరించిన నిశ్శబ్దం..  ఈ అన్ని భావోద్వేగాల సమాహారంగా అమరావతి మళ్లీ గౌరవంతో అవతరించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కేవలం శాసన ప్రక్రియలో భాగమైన నిర్ణయం కాదని, ప్రజల గౌరవాన్ని పునరుద్ధరించిన ఘట్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఆయన స్మరించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి, భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. అమరావతి నిర్మాణానికి తమ భూములను సమర్పించిన రైతుల త్యాగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, 33,000 ఎకరాలకు పైగా భూమిని వారు స్వచ్ఛందంగా అందించారని గుర్తు చేశారు. వారి విశ్వాసానికి ఇప్పుడు న్యాయం జరిగిందని తెలిపారు. అమరావతి అభివృద్ధి కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు పవన్  కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

గత కొన్నేళ్లుగా అమరావతి అనిశ్చితిలో కొనసాగిందని, విధాన మార్పులతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన (Pawan Kalyan) గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజలు నమ్మకాన్ని కోల్పోలేదని, వారి ఆకాంక్షలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయని అన్నారు. ఇది కేవలం రాజధాని పునరుద్ధరణ మాత్రమే కాదు ఆత్మగౌరవ పునరుద్ధరణ అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అమరావతి ఇకపై స్థిరత్వానికి, అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>