కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని, జూ పార్కులోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు జిరాఫీల సంరక్షణకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ఆయన వెల్లడించారు.
పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం నీటి ఏనుగులు, పులులు, సింహాల ఎన్క్లోజర్లను పరిశీలించి, వాటికి అందిస్తున్న ఆహారం, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూ నిబంధనలను పాటిస్తూ , ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారాన్ని తినిపించారు.
అనంతరం కంబాలకొండ ఎకో పార్కుకు (Kambalakonda Eco Park) వెళ్లిన ఆయన, అక్కడ నగర వనాన్ని ప్రారంభించారు. అక్కడి చెక్క వంతెనపై కనోపీ వాక్ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షించారు. మార్గమధ్యలో కనిపించిన వివిధ రకాల మొక్కల విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిలిచిన జూ సందర్శన.. పర్యాటకుల ఆగ్రహం
విశాఖపట్నం జూపార్క్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పర్యటన నేపథ్యంలో అధికారులు సామాన్య సందర్శకులను లోపలికి అనుమతించలేదు. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ గేట్ల వద్దే నిలిపివేయడంతో పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూ సిబ్బందికి, సందర్శకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా జూ మూసివేయడంపై పర్యాటకులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.
Read Also: సోషల్ మీడియా నియంత్రణపై.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Follow Us On : WhatsApp


