కలం డెస్క్ : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మల్లగుల్లాలు పడుతున్న రాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టులోనూ ఒక పిటిషన్ దాఖలు కావడం తలనొప్పిగా మారింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు ప్రశ్నార్ధకంగా మారడంతో లాయర్లకు లోతుగా వివరించడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో పలువురు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తున్నది.
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో సీనియర్ లాయర్లను నియమించి వారి ద్వారా రిజర్వేషన్ ఫార్ములాకు అనుకూల ఫలితం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్(BC Reservations) పైనా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సాధికారతపైనా, దానికి దారితీసిన కారణాలపైనా లాయర్లకు వివరించనున్నారు.
లోతైన వాదనలు వినిపించేలా.. :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% పక్కాగా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని డిప్యూటీ సీఎం, మంత్రులు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలన్నీ పూర్తి చేసి పోలింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ కావడం తలనొప్పిగా మారింది. ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో పోలింగ్ జరగడం ప్రశ్నార్ధకంగా మారడంతో సుప్రీంకోర్టులో జరిగే విచారణలో సీనియర్ లాయర్ల ద్వారా లోతైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం భావించింది. న్యాయపరమైన అంశాల్లో సలహాలు సూచనలు స్వీకరించి బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా ప్రభుత్వం పక్షాన బలమైన వాదనలు వినిపించనున్నారు.

