కలం డెస్క్ : జూబ్లీ హిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి వచ్చింది. దాదాపు డజను మంది ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నా పీసీసీ మాత్రం నలుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. తొలి నుంచీ వినిపిస్తున్న నవీన్ యాదవ్ పేరుతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. ఈ నలుగురి పేర్లను పరిశీలించిన అనంతరం ఏఐసీసీ ఒకరి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నది.
ఇద్దరు యాదవ్ ల పేర్లు :
జూబ్లీ హిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలోని నాలుగు లక్షల ఓటర్లలో యాదవ్, ముస్లిం మైనారిటీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అందుకే పీసీసీ షాల్ట్ లిస్ట్ చేసిన నలుగురిలో ఇద్దరు (నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్) సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. దీనికి తోడు కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓటర్లూ కీలకంగా మారనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ పేరు కూడా షార్ట్ లిస్టులో చేరింది. కమ్మ సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుంటున్నారు.
కీలకంగా మజ్లిస్ మద్దతు :
ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. షేక్ పేట్, టోలీ చౌకీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకం కానున్నారు. మొత్తం నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు దాదాపు 30% ఉంటారని అంచనా. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2014లో) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ 42 వేల ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఏక కాలంలో అటు ముస్లిం ఓటర్లు, ఇటు సామాజికవర్గం రీత్యా యాదవ్ ఓటర్లు నవీన్ యాదవ్ కు కలిసొచ్చే అంశమన్నది కాంగ్రెస్ అంచనా. నవీన్ యాదవ్ ను ఖరారు చేస్తే మద్దతు ఇస్తామని మజ్లిస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ కు సంకేతమిచ్చింది.
పైచేయి సాధించే ఎత్తుగడ :
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానమైనందున ఈసారి ఉప ఎన్నికలో గెలిచి తీరాలని భావిస్తున్నది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో ఉప ఎన్నిక జరుగుతున్నందున సానుభూతి పవనాలు వీస్తాయన్న అంచనాతో ఆయన భార్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసింది. రెండు సర్వేల్లోనూ బీఆర్ఎస్ కు గెలుపు ఖాయమని వచ్చిన ఫలితాలపై ఆశలు పెట్టుకున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం మూడు సర్వేలు నిర్వహించగా చివరిది అనుకూలంగా ఉంటుందని తేలింది. పరిస్థితులు మారాయని, గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. మజ్లిస్ మద్దతుతో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు అనుకూలంగా మారుతుందని, బీఆర్ఎస్ నుంచి ఈ స్థానాన్ని కైవశం చేసుకోవచ్చని ధీమాతో ఉన్నది. అందువల్ల నలుగురి పేర్లతో ఏఐసీసీకి చేరిన షార్ట్ లిస్టు గురించి రాష్ట్ర నేతలు వివరించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయాలని కోరే అవకాశమున్నది.

