epaper
Wednesday, February 18, 2026
epaper

హైదరాబాద్‌లాగా మధిరను అభివృద్ధి చేస్తా : డిప్యూటీ సీఎం భట్టి

కలం/ఖమ్మం బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఎలాంటి రక్షణ, వైద్య, విద్య సదుపాయాలు ఉన్నాయో అవన్నీ మధిరలో కల్పించడమే తన లక్ష్యం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka ). మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు. వైరా, మధిర మున్సిపాలిటీల్లో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలన్న ఆలోచనతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటికే 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, పట్టణాల్లోని మహిళా సంఘాలకు మెప్మా ద్వారా శిక్షణ ఇప్పించి పరిశ్రమలు పెట్టిస్తున్నట్టు వివరించారు.

ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనేకమంది ఇండ్లు కావాలని అడిగారని.. అందుకే మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించినట్టు భట్టి తెలిపారు. ఇందుకోసం 22,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం ఇస్తున్నామన్నారు. మరో 50 ఏళ్ల దాకా మధిర మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. కాంగ్రెస్ పక్షాన బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

100 కుటుంబాలకు హామీ..

వైరా (Wyra) నుంచి శనివారం సాయంత్రం మధిర వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి వాహనం వద్దకు 100 మంది వీధి వ్యాపారస్తులు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వారి గురించి మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ హయాంలో వారు రోడ్డు పక్కన పెట్టుకున్న చిన్న దుకాణాలను కూల్చేశారని.. వాటిని పునర్నిర్మించి ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎంను కోరారు. ఇందుకోసం సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని తెలపగా.. డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తూ.. తప్పకుండా కట్టిస్తామని తెలిపారు. పూర్తి నివేదికను పంపాలని అధికారులను అక్కడే ఆదేశించారు. అంచనాలకు సంబంధించిన నివేదికలు రాగానే అనుమతులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Read Also: చిట్యాల మహిళలతో రైస్‌మిల్లు పెట్టిస్తాం : మంత్రి సీతక్క

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>