కలం, కరీంనగర్ బ్యూరో : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటేడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం భట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి భూమి పూజ చేశారు.
అలాగే సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గం లోని 11 ప్రాంతాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి భట్టి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మొత్తం తీసుకోవాలని కోరారు. రైతులకు ఆనేక రకాల ప్రోత్సహకాలు అందించి రైతులకు అండగా నిలబడిందన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు.
మరోవైపు, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు రైతులు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ మల్లుగారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి…
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం (Deputy CM Bhatti) తెలిపారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే రూ. 300 కోట్ల బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ. 2 వరకు తగ్గించేలా ఎన్‌పీడీసీఎల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ. ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతి వారం బిల్లులు చెల్లించడం జరుగుతుందని వివరించారు.
ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ముందు ఉన్న సందర్భంగా జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. రాష్ట్రంలో మొత్తం కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని, అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేసే అధికారులకు తప్పని సరిగా గుర్తించి ప్రభుత్వం ఆవార్డులు, రివార్డులు ఇస్తుందన్నారు. పని చేయని అధికారుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని భట్టి వెల్లడించారు.
Read Also: దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp

