ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి : డిప్యూటీ సీఎం భట్టి

కలం, కరీంనగర్ బ్యూరో: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటేడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి భూమి పూజ చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గం లోని 11 ప్రాంతాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మొత్తం తీసుకోవాలని కోరారు.

రైతులకు ఆనేక రకాల ప్రోత్సహకాలు అందించి రైతులకు అండగా నిలబడిందన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు. మరోవైపు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు రైతులు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు.

సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పడిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగడమే కాకుండా, రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) తెలిపారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే రూ. 300 కోట్ల బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూ. 2 వరకు తగ్గించేలా ఎన్‌పీడీసీఎల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ముందు ఉన్న సందర్భంగా జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. రాష్ట్రంలో మొత్తం కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని, అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేస్తామని, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. కొనుగోలు సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్ పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>