కలం డెస్క్: ఢిల్లీ నగరం సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు నగరాల్లో వాయు కాలుష్యం దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫైయర్లపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని తగ్గించడంపై కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సూచించింది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లేకుండా పన్ను తగ్గింపుపై విధాన నిర్ణయం తీసుకోలేని కారణంగా వీలైనంత తొందరగా ఆ సమావేశం కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని Delhi High Court సూచించింది. కౌన్సిల్‌తో సంబంధం లేకుండా కోర్టు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, వివాదాస్పదమవుతుందని జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫైయర్లు మెడికల్ డివైజెస్ కేటగిరీలో ఉన్నందున ప్రస్తుతం వసూలు చేస్తున్న 18% పన్నను 5% కి తగ్గించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు పై కామెంట్లు చేసి తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులు సొంతంగా జోక్యం చేసుకోలేవు : కేంద్రం
ఎయిర్ ప్యూరిఫైయర్లపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)పై ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకుంటే తేనెతుట్టెను కదిపినట్లవుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరామన్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినందున నిర్ణయాలు తీసుకునేందుకు నిర్దిష్ట ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. దీన్ని విస్మరించి కోర్టే ఆదేశాలు ఇస్తే భవిష్యత్తులో అనేక ఉత్పత్తులపై ఈ తరహా మినహాయింపులు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించిన తర్వాత నిర్ణయం జరగాల్సి ఉంటుందన్నారు. ఏ నిర్ణయమైనా అది జీఎస్టీ కౌన్సిల్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుందన్నారు.
తక్షణం మేం నిర్ణయం తీసుకోలేం : ఢిల్లీ హైకోర్టు
ఎయిర్ ప్యూరిఫైయర్లపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం వివరణ రాకుండా కోర్టులు నిర్ణయం తీసుకోలేవని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేమని పేర్కొన్నది. కేంద్రం తన వివరణను కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని, దాన్ని లోతుగా స్టడీ చేసిన తర్వాత కోర్టు ఒక అభిప్రాయానికి వస్తుందని పేర్కొన్నది. కానీ ఢిల్లీ సహా పలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం మాత్రం ఉన్నదని వ్యాఖ్యానించింది. ఒక్కో ఎయిర్ ప్యూరిఫైయర్ ధర ఓపెన్ మార్కెట్‌లో పది వేల రూపాయల నుంచి దాదాపు రూ. 15 వేల వరకు ఉన్నదని, సాధారణ ప్రజానీకానికి స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు వీలుగా వాటి ధరలు తగ్గేలా కేంద్రం ఎందుకు పాజిటివ్ నిర్ణయం తీసుకోకూడదన్న కామెంట్ చేసింది. పది రోజుల్లోగా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించి తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
Read Also: నేడు ఢిల్లీకి రేవంత్ .. అసంతృప్తులకు పదవులపై చర్చ
Follow Us On: Sharechat


