కలం వెబ్ డెస్క్ : వెండి, బంగారం ధరలు(Gold, Silver Prices) సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారంతో పోటీ పడుతూ వెండి ధర కొండెక్కుతోంది. శుక్రవారం ఒక్కరోజే వెండి ధర కేజీ(kg)కి రూ.6,000 పెరిగి రూ.2.4 లక్షలకు చేరుకుంది. గత వారం రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ.29 వేలు (14.33 శాతం) పెరిగిపోయింది. మరోవైపు బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.770 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,020గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350గా ఉంది.
సిల్వర్, గోల్డ్ ధరలు (Silver Prices) పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. మధ్య తరగతి ప్రజలు పెట్టుబడికి ఎంచుకునే ప్రధాన మార్గాల్లో భూములతో పాటు వెండి, బంగారానిదే అగ్రస్థానం. ధరలు పెరుగుతున్న కొద్దీ ఆభరణాల షాపుల ముందు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. భవిష్యత్తులో కొనలేమన్న భయమో… లేక పెట్టుబడి కోసం ఆరాటమో కానీ ఎంత డబ్బులుంటే అంత పెట్టి సిల్వర్, గోల్డ్ కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. రోజు ఆభరణాల దుకాణాలు కస్టమర్లతో కలకలలాడుతున్నాయి.
వెండి ధగధగలు.. పెట్టుబడులకు ఉత్తమం
ఒకప్పుడు మార్కెట్‌లో బంగారం గురించే చర్చ నడిచేది. వెండిని ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. వెండి ధరలు సైతం అంతంతమాత్రంగానే ఉండేవి. కొనుగోళ్లు, వినియోగం, ధరల పెరుగుదలలో స్వర్ణానిదే టాప్ ప్లేస్. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ధగధగ మెరిసే వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ధరల పోటీలో బంగారాన్ని దాటుకుంటూ వెండి పరుగులు పెడుతోంది. 2024లో కేజీ సిల్వర్ ధర రూ.95 వేల నుంచి రూ.97 వేల వరకు ఉండేది. కానీ, ప్రస్తుతం ఏకంగా రూ.2.4 లక్షలకు చేరింది. 2026 చివరికల్లా కేజీ వెండి ధర రూ.4 లక్షలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెండిలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయని సూచిస్తున్నారు.
వెండి ధర పెరగడం వెనుక కారణమేంటి..?
ప్రస్తుతం మార్కెట్‌లో వెండి ధర ఎందుకు ఇంతగా పెరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీని వెనుక పలు కారణాలున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, పలు పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వెండిని ఆభరణంగా, అలంకరణ వస్తువుగానే కాకుండా పలు పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, కాంటాక్ట్‌లు, సెమీకండక్టర్లు తయారీలో వాడతారు. వైద్య పరిశ్రమలో మందులు, గాయాలపై వేసే డ్రెస్సింగ్‌లు, వైద్య పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. సోలార్ పరిశ్రమలో సోలార్ ప్యానెల్స్‌లో విద్యుత్‌ను గ్రహించి ప్రసారం చేయడంలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఫిల్మ్ ఫోటోగ్రఫీలో సిల్వర్ హలైడ్స్‌లో వినియోగిస్తారు. ఆహార పరిశ్రమలో సైతం అలంకరణకు కొద్ది మోతాదులో ఉపయోగిస్తారు. ఆయా పరిశ్రమల్లో వినియోగం పెరుగుతుండటంతో వెండి ధరలు పెరుగుతున్నాయి.
Read Also: చలికాలంలో పెరుగుతున్న గుడ్ల ధరలు.. కారణం ఇదేనా!
Follow Us On : WhatsApp


