కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, బూర్గంపాడు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల (Paddy Procurement Centres) ఏర్పాటులో జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. పండించిన ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేక ప్రభుత్వం తరఫున కొనేవారు లేక రైతులు దళారుల వలలో చిక్కుకునే పరిస్థితి నెలకొంది. దళారులు తక్కువ రేటుకు ధాన్యం కొనడం వలన నష్టాల ఊబిలో చిక్కుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ మద్దతు ధర రూ.2,369 ఉండగా తమ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని దళారులు రూ.1600 నుంచి రూ.2000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
బూర్గంపాడు మండలంలో సుమారు 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఇంత వరకూ ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. మరో పక్క రైతులు, కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని ఆరబెట్టుకొని, కొనుగోలు కేంద్రాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో వర్షం పడితే, వారి శ్రమ అంతా నీటి పాలవుతుంది. అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోంది. అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
“నేను రెండు ఎకరాల్లో వరి పొలం వేశాను. పంట కూడా కోశాను. పొలం దగ్గరే ఆర బెట్టాను. ప్రభుత్వం పంట కొనుగోలు ఇంకా ప్రారంభించలేదు. అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో మాకు భయం వేస్తుంది. ప్రభుత్వం త్వరగా కొనుగోలు ప్రారంభించాలని కోరుతున్నాను” – కనుకు రాఘవులు, బూర్గంపాడ్.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On: X(Twitter)

