కలం, ఖమ్మం బ్యూరో: నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తున్నామని అధికారులు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనడానికి ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న పాత KMC లైబ్రరీ ప్రాంగణమే (Khammam Library) నిదర్శనంగా నిలిచింది. ఇక్కడి లైబ్రరీ వెనుక భాగంలోని పండ్ల మార్కెట్ రేకులపై ఒక కోతి చనిపోయి మూడు రోజులు గడుస్తున్నా, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత, వాతావరణ మార్పుల వల్ల ఆ వానరం కళేబరం (Dead Monkey Carcass) పూర్తిగా కుళ్లిపోయి, పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోంది.
ఈ పాత కేఎంసీ లైబ్రరీకి (Khammam Library) ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, పాఠకులు వచ్చి చదువుకుంటూ ఉంటారు. అయితే గత మూడు రోజులుగా వస్తున్న భరించలేని వాసన కారణంగా లైబ్రరీ హాల్లో కూర్చోలేక, చదువుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, దీనికి ఆనుకునే ఉన్న పండ్ల మార్కెట్ వ్యాపారులు, అక్కడికి వచ్చే వినియోగదారులు కూడా ముక్కు మూసుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్వాసన వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నగరంలో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన కేఎంసీ శానిటేషన్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యేక సిబ్బందిని పంపి సదరు కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించి పారిశుధ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Read Also: షాబాద్ నిందితుడి మృతి.. సోదరుడి సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: Sharechat

