యువత సమస్యల పరిష్కారానికి పోరు బాట : ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఆచరణలో విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) కరీంనగర్ జిల్లా 16వ మహాసభలను స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించారు. మహాసభల ప్రతీకగా ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మాజీ ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడిపల్లి రాజు ఎగురవేశారు.

ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తూ, కాంట్రాక్టీకరణ – ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తూ శాశ్వత ఉద్యోగ అవకాశాలను కుదిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్స్, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, నియామకాలలో జాప్యం, విద్యా–వైద్య రంగాల వాణిజ్యీకరణ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడం, ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడంలో ఆశించిన పురోగతి సాధించలేదని విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చేలా ప్రభుత్వం నిర్ధిష్ట ప్రణాళిక చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యా, రాజకీయ చైతన్యానికి కేంద్రంగా ఉన్నప్పటికీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత, గ్రంథాలయాల అభివృద్ధి లోపం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కొరత, క్రీడా సదుపాయాల లోపం, నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. జిల్లా పరిశ్రమల్లో స్థానిక యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, జిల్లా కేంద్రంలో ఆధునిక యువజన అభివృద్ధి కేంద్రం, స్టడీ సర్కిల్, కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో ఎన్నడూ ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 – 2026 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగనున్న AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువజన సమస్యల పరిష్కారానికి, విద్య–ఉపాధి హక్కుల సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, ప్రజాస్వామ్య–లౌకిక భారత నిర్మాణానికి కొత్త కార్యాచరణను రూపొందించనున్నాయన్నారు.

ఈ మహాసభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి, సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనగిరి మహేందర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంజిత్, కె.సంతోష్ చారి, రమ్య, శ్రీనివాస్, మురళి, స్వాతి, తిరుపతి, చెంచల రవి, అవినాష్, శివ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also : గజ్వేల్‌ కాంగ్రెస్‌లో ‘రెబెల్’ మంటలు..పీసీసీ చీఫ్ వర్సెస్ తూంకుంట

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>