మక్తల్ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు.. నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శ్రీకారం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మక్తల్ (Makthal) నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హ్యామ్ రోడ్ల (HAM Roads) శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‌లకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మక్తల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో పాటు ప్రజాప్రతినిధులు కలిసి రూ. 237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు సోమవారం శంకుస్థాపన చేసి, హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ (Makthal) నుంచి నారాయణపేట వరకు రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారిందన్నారు.

దాదాపు పది మంది కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేదని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పదేళ్ల పాటు మాటలు, ప్రచార ఆర్భాటాలు, రంగు రంగుల హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. నిర్మించిన రహదారులు కూడా నాసిరకంగా ఉండటంతో వందలాది గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ. 237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని కోరినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Read Also: ‘కాళేశ్వరం’పై కేంద్రం సమావేశం నిర్వహించాలి: జగ్గారెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>