కలం, నల్లగొండ బ్యూరో : మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో పసికందుల మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోని రెండు శిశువుల మృతదేహాలు (Dead Infant) వెలుగులోకి రావడం పట్ల స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. మిర్యాలగూడ పట్టణంలోని షాపూర్ నగర్ లో బుధవారం ఓ డ్రైనేజీ పక్కన ఆరు నెలల ఆడ శిశువు మృతదేహం బయటపడింది. రోజువారి విధుల్లో భాగంగా ఓ పారిశుధ్య కార్మికుడు విధులను శుభ్రం చేస్తుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే స్థానికులతో పాటు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే ఈ ఆడ గర్భస్థ మృతదేహాన్ని అబార్షన్ చేయించుకొని ఇక్కడ పడేశారు. అయితే ఈ గర్భస్థ ఆడ మృతదేహం ఇక్కడి స్థానికులకు సంబంధించిన లేదా ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ పడవేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం కుక్క నోట్లో గర్భస్థ ఆడ శిశువు మృతదేహం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ సబ్ జైల్ రోడ్డులో నెలలు నిండని ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్ లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేయగా, కుక్కలు నోట్లో పెట్టుకుని పీక్కుతింటున్న దృశ్యం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం..
మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో వరుస ఆడ పసికందు మరణాల పట్ల స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సంబంధమో.. ఆడపిల్ల పుడుతుందనే కారణమో తెలియదు గానీ అబార్షన్ల ద్వారా కళ్లు తెరవని శిశువుల ప్రాణాలను తీస్తుండడం పట్ల తీవ్ర కలవరం మొదలయ్యింది. అసలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండడం వల్లే.. తల్లి గర్భంలోనే ఆడ శిశువులను హత మారుస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో అబార్షన్ చేసే డాక్టర్లను గుర్తించివారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి వికృత చర్యలకు చరమగీతం పాడినట్టు అవుతుందని స్థానికులు కోరుతున్నారు.
Read Also: ఝాన్సీరెడ్డి, ఎర్రబెల్లి ఒక్కటయ్యారు.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
Follow Us On: Youtube


