కలం, వరంగల్ బ్యూరో : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోగా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్లను మార్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) ఆరోపించారు. హనుమకొండ (Hanumakonda) బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ కేసులో విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇటీవల కేటీఆర్ రైతుల పక్షాన సదస్సు నిర్వహిస్తే.. మున్సిపల్ సిబ్బందితో పార్టీ జెండాలు తొలగిస్తున్నారని కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన పార్టీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలుగా కేంద్రమంత్రి తనయుడి చేష్టలకు వేదన అనుభవిస్తున్న బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పోక్సో యాక్ట్ నమోదు చేసినప్పటికీ.. అరెస్ట్ చేయడానికి వెనుకాడుతున్న తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ నిందితున్ని కఠినంగా శిక్షించాలని అంటుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి, నాయకులకు వంత పాడుతూ నేరస్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ నాయకుల అరాచకాలకు కవచంగా ఉన్న రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజల మద్దతుతో దశలవారీగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు

