కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ (Kidney Transplant) శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. నిమ్స్‌లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ వైద్యులు, సిబ్బందిని ఆయన సత్కరించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం నిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు..
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయని మంత్రి (Damodar Rajanarsimha) కొనియాడారు. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటే భారీ ఖర్చుతో కొద్దిమందికే అందుబాటులో ఉండేదని గుర్తు చేశారు. ఈరోజు ప్రభుత్వ సంకల్పంతో పేదలకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అవయవ మార్పిడి ఆపరేషన్‌కే కాదని.. ఆపరేషన్ అనంతరం జీవితాంతం ఉచితంగా మెడిసిన్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. డయాలిసిస్ నుంచి ట్రాన్స్‌ప్లాంట్ వరకు పూర్తి కిడ్నీ కేర్ ఎకోసిస్టమ్ ను ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు.
100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు. మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నిమ్స్‌తో పాటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో స్టేట్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఇటీవలే ప్రారంభించుకున్నామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన సనత్‌నగర్ టిమ్స్ (TIMS)ను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
Follow Us On : WhatsApp

