కలం, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్వనాల్లో సామాన్యులకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
10 రోజుల్లో మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (దాదాపు 90%) సామాన్యులకే కేటాయించామన్నారు. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు (Devotees) తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, సమయంలోనే తిరుమలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ సక్రమంగా నిర్వహణ చేపడుతున్నామని వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, భద్రత సహా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని, అన్ని వర్గాల భక్తులు సంయమనం పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు.


