కలం, వెబ్‌డెస్క్: మూలిగే నక్కపై తాటికాయపడినట్లు మారింది చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పరిస్థితి. గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిన బాధలో ఉన్న సీఎస్‌కేకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తో పాటు జట్టు మొత్తంపై భారీ జరిమానా విధించారు. మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడమే ఈ జరిమానాకు కారణం. ఈ సీజన్‌లో చెన్నై జట్టు (CSK) ఇలాంటి తప్పు చేయడం ఇది రెండోసారి కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 229 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే చెన్నై బౌలర్లు తమ కోటా ఓవర్లను పూర్తి చేయడానికి నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఏకంగా రూ. 24 లక్షలు జరిమానా పడింది. కేవలం కెప్టెన్‌పైనే కాకుండా జట్టులోని మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా ఐపీఎల్ యాజమాన్యం పెనాల్టీ విధించింది. మిగిలిన ప్రతి ఆటగాడికి రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానాగా చెల్లించాలని స్పష్టం చేసింది.

