కలం, కరీంనగర్ బ్యూరో : రైతు సమస్యలపై బిజెపి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని సిపిఎం (CPM) కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్‌లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సంవత్సరం పాటు శాంతియుతంగా ధర్నా చేశారని గుర్తు చేశారు. నిరసన తెలిపిన 1200 మంది రైతులను బిజెపి ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని సత్యం ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళన, పోరాటాన్ని అణచివేస్తూ ముళ్లకంచెలు పెట్టారని.. ఇప్పుడు కరీంనగర్‌లో రైతు సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పైన ప్రేమతో చేస్తున్న ధర్నా కాదని.. బండి సాయి భగీరథ్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి అనేకమంది రైతులను పొట్టన పెట్టుకున్న బిజెపికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. గడిచిన 10 రోజులలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి రైతుల పైన తీవ్ర భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరల పెంపు మూలంగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రైతులకు రుణాలు ఇవ్వకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు రుణాలు ఇస్తూ దేశ సంపదలను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సకాలంలో ఎరువులు, మందులు అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా భీమా సౌకర్యం కల్పించాలన్నారు. పంట కొన్న వెంటనే డబ్బులు చెల్లించాలని.. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

