కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లాలో భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయకూడదని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి (Marri Yadava Reddy) సూచించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుడా చైర్మన్ ఇనగాల వెంకట్ రామ్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్‌పై కూడా స్పందించారు. వెంకట్ రామ్ రెడ్డి చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారని, అది నాయిని రాజేందర్ రెడ్డి చెబితే పెట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. వెంకట్ రామ్ రెడ్డి కాంగ్రెస్ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసినా టికెట్ రాలేదని, ఆయనకు ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపు అనుభవం లేదని విమర్శించారు. ప్రజా తీర్పుతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్‌పై మాట్లాడటం సరికాదని మర్రి యాదవ రెడ్డి అన్నారు.
రికార్డుల ప్రకారం భక్తాంజనేయ దేవాలయ భూమి ఆలయానిదేనని ఆయన తెలిపారు. న్యూశాయంపేటలో ప్రతిష్టించిన హనుమాన్ విగ్రహాన్ని కూల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నాయిని రాజేందర్ రెడ్డి సహకరించాలని, ప్రజల కోరికను ఎందుకు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. పార్టీలకు అతీతంగా భక్తుల కోసం చేసిన కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనది కాదని పేర్కొన్నారు. విగ్రహాన్ని ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దాస్యం విజయ్ భాస్కర్, సంకు నర్సింగరావు, ఇమ్మడి లోహితరాజు, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, ఉడతల సారంగపాణి, సీనియర్ నాయకులు తాళ్లపెల్లి జనార్ధన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, లీగల్ సెల్ బాధ్యులు వినోద్ కుమార్, నాయకులు జానకి రాములు, గుడి కమిటీ సభ్యులు, న్యూశాయంపేట ప్రజలు పాల్గొన్నారు.

