కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో ఖాళీగా ఉన్న డబుల్ బ్రెడూం ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ ఆరు గ్యారెంటీలను సైతం పూర్తిగా అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా నగరంలో ప్రభుత్వ హయాంలో డబుల్ బ్రెడూం ఇండ్ల నిర్మాణం పూర్తయినా, అర్హులకు పంపిణీ చేయలేదన్నారు. దాంతో విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయన్నారు. ఇప్పటికైనా అర్హులైన నిరుపేదలకు అందించాలన్నారు.
అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని పేదలకు, ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నగరంలో ఇందిరమ్మ ఇండ్ల కోటాను పెంచాలన్నారు. వర్షాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. పైపుల లీకేజీలను అరికట్టి, మంచినీరు అందివ్వాలన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సంధ్యారాణి, జిల్లా అధ్యక్షులడు కె. గణేశ్, జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, పీవైఎల్ నాయకులు మారుతి, జిల్లా నాయకులు టీయూసీఐ జిల్లా నాయకులు లింగం పాల్గొన్నారు.

