సామాన్య ప్రజలపై భారం మోపితే ఊరుకునేది లేదు: అందెస్వామి

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్,పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమవుతూ ధరలు పెంచాలనే ఆలోచనతో ఉందని సీపీఐ (CPI) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందె స్వామి (Ande Swami) అన్నారు. సామాన్య ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అధిక ధరలకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు బుధవారం కరీంనగర్‌ (Karimnagar) లోని కమాన్ చౌరస్తా వద్ద సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి , ఇతర నేతలు పాల్గొని ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందె స్వామి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికలు అయిపోయాక మరోలా వ్యవహరించడం బీజేపీకే సాధ్యమని విమర్శించారు. సామాన్య పేద కుటుంబాలపై భారం మోపడానికి పెట్రోల్, డీజిల్ పై రూ.5, వంట గ్యాస్ పై రూ.50 పెంచడానికి ఆయిల్ కంపెనీలు చూస్తున్నాయని, ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ అసమర్థతేనని స్వామి అన్నారు.

రాష్ట్రంలో రైతాంగం పండించిన పంటలు కోసే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. చిన్న చిన్న వ్యాపార వర్గాలపై ప్రభావం పడుతుందని, వాణిజ్య సిలిండర్ పై ఇప్పటికే రూ.993 పెంచడంతో అది రూ.3,100లకు చేరిందని తెలిపారు. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరలు పెంచినట్లయితే పేద కుటుంబాలు ఎలా జీవిస్తాయని ప్రశ్నించారు. చమరు గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని, పెట్రోల్, డీజిల్ కొరతల వల్ల బంకుల వద్ద భారీగా జనాలు బారులు తీరుతున్నారని అన్నారు.

ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదని చెప్పడం సరైంది కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే ధరలు పెంచే ఆలోచన విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అందె స్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపెల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బామండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు నూనావత్ శ్రీనివాస్, పి.సాంబయ్య, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: 9న బెంగాల్‌ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం: ఆ కీలక నేత ఎవరు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>