కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుత రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంపై స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయిల్ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యుద్ధం కారణంగా భారత ప్రజలు బాధితులుగా మిగిలారని, దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినవారు రోడ్డున పడ్డారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలున్న మోదీ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించడం లేదన్న ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని నెలకొల్పడంలో భారత ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న హింసకు మరియు యుద్ధానికి వ్యతిరేకంగా వామపక్ష ప్రజా సంఘాలు ఈ నెల 29న హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీని చేపడుతున్నట్లు నారాయణ వెల్లడించారు. సమాజంలోని శాంతి కాముకులు, ప్రజా సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
టీటీడీ వ్యవహారంపై నారాయణ వ్యాఖ్యలు
టీటీడీ ఛైర్మన్ వ్యవహారంపై సీపీఐ నారాయణ (CPI Narayana) తీవ్ర విమర్శలు చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని, అయితే ఛైర్మన్ ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివారు టీటీడీ ఛైర్మన్ గా ఉండకూడదని సీపీఐ నారాయణ అన్నారు. అలాగే ఇటీవల గరికపాటి నరసింహారావు (Garikapati) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆయన మధ్యాహ్న భోజన (Mid Day Meal) పథకం గురించి అలా మాట్లాడటం సరికాదన్నారు. కాగా, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి.. పుస్తకాలు, బట్టలు అన్నీ ఉచితంగా ఇస్తే చదువుపై ఇంకేం శ్రద్ధ పెడతారని.. టీచర్లకు చదువు చెప్పడం కంటే వంట వండించటం, గుడ్లు లెక్క రాయడమే సరిపోతుందని గరికపాటి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అటు వైఎస్ విజయమ్మ ఇటీవల రాసిన బహిరంగ లేఖపై కూడా నారాయణ స్పందించారు. వైఎస్ కుటుంబంలో వివాదం విచారకరమని, కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామల వల్ల దివంగత వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పుకొచ్చారు.
Follow Us On: Instagram

