కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సెక్యులరిజాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ (CPI Narayana ) అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ లో ఆయన సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు సీపీఐ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు సతీమణి సుమతి ని పరామర్శించారు.మతోన్మాదం పేరుతో దేశంలో బీజేపీ సర్కార్ ప్రజా సమస్యలను పక్కకు పెట్టి హిందుత్వ ఎజెండాను అమలుపరుస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1న దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమం సీపీఐ నిర్వహిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, సామాన్యుడు బతకటానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేసిందని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనారు. ప్రజా ఆగ్రహంతో బంగ్లాదేశ్, శ్రీలంక ,నేపాల్ ప్రభుత్వాలు కుప్పకూలినాయని, మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను ప్రజలు మట్టికరిపిస్తూ టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
దేశంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, సీబీఐ వ్యవస్థల పైన ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెడితే రానున్నకాలంలో బీజేపీని, రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ప్రజలు పక్కకు పెట్టే తరుణం ఆసన్నమైతదని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నందువలనే కాక్రోచ్ పార్టీ రూపాంతరం చెందింది, వాళ్లు కూడా ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో కమ్యూనిస్టుల పైన విశ్వాసం ఉన్నది, కానీ ఎన్నికల్లో వచ్చేసరికి ఓట్లు, సీట్లు రాబట్టడంలో వైఫల్యం జరుగుతుందన్నారు. దీన్ని కమ్యూనిస్టులుగా తాము అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారు వర్గాలకు దోచిపెడుతున్న పాలకుల విధానాలను ఎత్తిచూపుతూ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం దేశ సమగ్రత శ్రేయస్సుకోసం కమ్యూనిస్టులు వాచ్ డాగ్ లో పనిచేయాలని ,అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ విస్తరణ, బలోపేతం గ్రామస్థాయి నుంచి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి బి పరమేశ్ గౌడ్, సీపీఐ నాయకులు పద్మావతి సత్యనారాయణ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

