ప్రజాధనం దుర్వినియోగం.. సుడాపై సిపిఐ ఫిర్యాదు

కలం, కరీంనగర్ :  కరీంనగర్ (Karimnagar) నగరంలో శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సిపిఐ ప్రతినిధి బృందం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ.. నగరంలో సుడా చేపట్టిన అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.

వీధి దీపాల ఏర్పాటులో అక్రమాలు

వీధి దీపాల ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని పైడిపల్లి రాజు ఆరోపించారు. ఐదేళ్ల గ్యారంటీ ఉన్న బల్బుల పేరుతో నాసిరకం పరికరాలను వినియోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో చేపట్టిన జంక్షన్ ఆధునీకరణ పనులలో అసలు పనులు పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ సుడా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పైడిపల్లి రాజు కోరారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బావండ్లపల్లి యుగంధర్, నగర కార్యవర్గ సభ్యులు కసిబోజుల సంతోష్ చారి, బాకం అంజన్న, బోయిని విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>